• నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడమేంటి?
• దేశంలో ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు?
* యధేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనలు
* పెద్దాపురం పోలీసుల ఓవర్ యాక్షన్
UPDATED 25th MAY 2018 FRIDAY 11:00 AM
పెద్దాపురం (రెడ్ బి న్యూస్): సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నియోజకవర్గ పరిధిలోగల పెద్దాపురం పోలీస్ స్టేషన్లో యధేచ్చగా హక్కులు ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ఇటీవల మున్సిపల్ చైర్మన్ హత్యకు కుట్ర, అలాగే దొంగనోట్లు కేసులతో పాటు అనేక కేసుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి తామేదో హీరోయిజం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో దాఖలైన కేసులు, దర్యాప్తు, నిందితుల అరెస్ట్ విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పోలీస్ యూనిఫామ్ ధరించిన తర్వాత విధి నిర్వహణను బాధ్యతగా నిర్వర్తించాలి కానీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి ఏదో హీరోయిజం చేసినట్లుగా భావించడానికి ఇది సినిమానో లేక కాల్పనిక కధో కాదు. పోలీస్ స్టేషన్లలో దాఖలైన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టడం మానవహక్కులను ఉల్లంఘించడమేనని పలువురు అంటున్నారు. ఎఫ్.ఐ.ఆర్ లో నిందితులుగా పేర్కొన్న వారిని దేశంలో ఏ చట్టం ప్రకారం మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు? నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత సంబంధిత ప్రాంతానికి చెందిన మేజిస్ట్రేట్ ముందు మినహా ఇతరుల ముందు హాజరుపర్చకూడదు. నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడితే వారు నిర్దోషులుగా నిర్ధారణ అయిన తర్వాత సైతం వారిని దోషులుగా భావించే అవకాశం ఉంది. మెజిస్ట్రేట్ లేదా సంబంధిత అధికారి మినహా థర్డ్ పార్టీ ముందు ఎలా ప్రవేశపెడతారు? కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని దోషులుగా ఎలా నిర్ధారిస్తారు? ఇది మానవహక్కులు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లఘించడమే అని సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశించాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.







