UPDATED 13th JANAUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య, మైనార్టీ సంక్షేమ,
ఎన్టీఆర్ వైద్యసేవ ఎపిఎంఎస్ఐడిసి ఫుడ్ సేఫ్టీ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. సామర్లకోట పింఛన్ లైన్లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మదర్సా/షాదీఖానా భవనానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నురానీజామియా మసీదు, మసీద్-ఎ-అమినా అసోసియేషన్ అధ్యక్షులు ఎం. గౌస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఫరూక్ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో ముస్లిముల జీవన విధానంపై కమిటీలు ఇచ్చిన సూచనలు ప్రకారం అన్ని కులాల కంటే ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి మసీదులు, షాదీఖానాలు నిర్మాణాలు చేపట్టి మైనార్టీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కళాశాలల ఏర్పాటులో కూడ వారికి అవకాశం కల్పించారని, మైనార్టీల మహిళల వివాహానికి రూ.50 వేలు ఆర్థిక సహకారం అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ చేయించుకున్న వారికి రూ.ఎనిమిది వేలు, ఆపరేషనుకు రూ.14 వేలు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులలో ప్రీడెలివరీకి రూ.9 వేలు, సిజీరియన్ ఆపరేషన్ కు రూ.16 వేలు ఎన్టీఆర్ సేవలు ద్వారా పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా షాదీఖానాకు స్థలం ఇచ్చిన దాతలను మంత్రి అభినందించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మైనార్టీలకు మసీదులు, హమామీలకు జీతాలు పెంచడం వివాహాలకు ఆర్థిక సహకారం, మహిళలకు కుట్టుమిషనులు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని, వ్యాపారం చేసుకునే వారికి అడ్డంకులు లేకుండా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎస్. రహమాన్, షేక్ బాబాజాన్, జార్జి చక్రవర్తి, గుమ్మళ్ళ రామకృష్ణ, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







