UPDATED 26th APRIL 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్ మెంట్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లీడ్ ఇండియా క్యాంపస్ హైరింగ్, విర్చూస కి చెందిన కృతివాసన్ శివ రామకృష్ణన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 2017-18 సంవత్సరంలో ఉద్యోగ నియామకం పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు వివిధ సంస్థలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, ఇందుకు కృషి చేస్తున్న ట్రెయినింగ్ అండ్ ప్లేస్ మెంట్ విభాగం వారిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధిని, సిబ్బందిని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించారు. 2014-18 బ్యాచ్ కి చెందిన విద్యార్థులలో అత్యధిక సంఖ్యలో 394 నియామకాలు సాధించిన విజయాన్ని, వారి కృషిని అభినందిస్తూ తాము ప్లేస్ మెంట్ డే- 2018 వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన 55 బహుళజాతి సంస్థలలో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని, రాబోయే రోజుల్లో మరింత విస్తృత సంఖ్యలో ఉద్యోగాలు సాధించే విధంగా జూనియర్ విద్యార్థులను ప్రోత్సహించాలని సీనియర్ విద్యార్థులకు ఆయన సూచించారు. ట్రెయినింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ ఎస్. వంశీకిరణ్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆహ్వానం పలుకుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలపై పూర్తి విశ్వాసంతో తమ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వివిధ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ కళాశాల విద్యార్ధులు, ప్లేస్ మెంట్ విభాగం వారి కఠోర శ్రమ, లక్ష్యసాధన కోసం చేసిన కృషి నేటి విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథి కృతివాసన్ శివరామకృష్ణన్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రముఖ కంపెనీలను తమ కళాశాలకు ఆహ్వానిస్తూ తమ విద్యార్థుల ఉద్యోగ నియామకాలకు కృషి చేస్తున్న కళాశాల మేనేజ్ మెంట్, ఉద్యోగులుగా నియామకం పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్ విర్చూస నవీన్, కళాశాల డైరక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి. హరనాధ బాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.యస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







