UPDATED 21st APRIL 2018 SATURDAY 9:00 PM
రాజానగరం: వేసవిలో ఎండతాకిడి అధికంగా ఉండటంలో ఎయిర్ కండీషనర్ల వినియోగం నానాటికీ పెరుగుతుంది. ఈ ఎయిర్ కండీషనర్ల వినియోగం వ్యయంతో కూడిన పని. అంతేకాక దీని వల్ల విద్యుత్ బిల్లులు పెరగడంతో పాటు కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుల అవసరాలు తీర్చేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) విద్యార్థులు స్మార్ట్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్ ను రూపొందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు తెలిపారు. . మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎ. శ్రీహర్ష, ఎం. వాసుదేవా, జి.శ్యామ్ కుమార్, వెంకట సాయిరత్న అతి తక్కువ ధరలో లభించే రీసైక్లింగ్ పరికరాలతో ఉష్ణగతిక నియమాలను అనువర్తించి ఈ స్మార్ట్ డివైజ్ ను తయారుచేశారు. దీనిలో నీరు నిల్వచేసే చిన్న స్టోరేజ్ ట్యాంకు ఉంటుందన్నారు. ఒక లోపవర్ విద్యుత్ మోటార్ సహాయంతో ట్యాంకులోని వాటర్ సర్క్యులేట్ అవుతుందన్నారు. ఈ సర్క్యూట్ లో అమర్చిన కాపర్ ట్యూబ్ వాటర్ కండెన్సర్ ఈ తిరుగుతున్న నీటిని చల్లబరుస్తుందన్నారు. ఫలితంగా దీనికి అమర్చిన ఫ్యాన్ ద్వారా అతి తక్కువ సమయంలో చల్లని గాలి బయటకు విడుదలవుతుందన్నారు. సాధారణంగా వాటర్ కూలర్లలా కాకుండా ఈ విధానంలో సర్క్యులేట్ అయిన నీరు మొత్తం తిరిగి స్టోరేజ్ ట్యాంకుకు రావడంతో నీరు అసలు వృథా కాదన్నారు. అంతేకాకుండా వాతావరణ రహితంగా ఉంటుందన్నారు. మోటార్ కు వెనుక భాగాన అమర్చిన హీటింగ్ కోయిల్ ద్వారా శీతల పరిస్థి తుల్లో ఉపయోగపడే విధంగా ఉష్టపూరితమైన గాలి వెలువడుతుందన్నారు. అది శీతాకాలంలో ప్రధానంగా పసిపిల్లలకు, వృద్దులకు చలి ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్య సమస్య లేకపోవడమే కాకుండా శ్వాసకోస ఇబ్బందులు కూడా తగ్గుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సులువుగా వాడుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తలుగా మెకానికల్ విభాగపు అధిపతి ప్రొఫెసర్ కె.ఎన్.ఎన్. మూర్తి, ప్రొఫెసర్ నాగభూణం వ్యవహరించారన్నారు.







