* ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 16th JULY 2020 THURSDAY 5:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సమాచార వ్యవస్థలు, అంతర్జాల సేవలు కీలక భూమిక పోషిస్తున్నాయని, ఆదిశగా ఐటీడీఏ పరిధిలో ఈ తరహా సేవలను విస్తరించడం జరుగుతోందని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని మరో 25 గ్రామాలలో ఫైబర్ నెట్ సేవలను ఆయన గురువారం ప్రారంబించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో సమాచార వ్యవస్థ విస్తృతమవుతున్నా గిరిజన ప్రాంతాలలో వాటి సేవలు అందుబాటులేక ఆయా ప్రాంతాల అభివృద్ధిలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సివస్తుందని, వాటిని అధిగమించేందుకు దశల వారీగా సమాచార వ్యవస్థల్లో గూగుల్ ఎక్స్ ద్వారా పలు టి.వి ఛానెల్స్, టెలిఫోన్, సెల్ ఫోన్, అంతర్జాల సేవలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామన్నారు. ప్రస్తుతం మొదటి దశలో రెండు మండలాల పరిధిలో 25 గ్రామాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోనికి వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి వసతిగృహాలలో ఈ- హాజరు, ఉపాధి హామీ పధకంలో ఈ-మస్తరు, అంతర్జాల సేవలు ద్వారా కుల, నివాస, ఆదాయ ధృవపత్రాలు, విద్యుత్ బిల్లులు చెల్లింపులు వంటి పౌర సేవలతోపాటు వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు ఎంతోగానో దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి సాంకేతికతను జోడించి పనుల ప్రగతిని సమీక్షించడం జరుగుతోందన్నారు. రెండవ దశలో మరో 24 గ్రామాలకు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ప్రజలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఫైబర్ నెట్ సేవలు ఆస్తిగా భావించి సక్రమరీతిలో వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఒక కోటి 43 లక్షలు అంచనా వ్యయంతో 49 గ్రామాలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సెల్ ఫోన్ లో మాట్లాడి ఈ సేవలు గురించి అవగాహన కల్పించారు. అనంతరం పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎపివో పివిఎస్ నాయుడు, ఎడిఎంహెచ్ వినోద్ కుమార్ డిఎంవో పి.వి సత్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్తీక్, సిడిపివో లు జి. వరహాలు, నీలవేణి, బి. మాధవి, క్రాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.







