UPDATED 9th AUGUST 2019 FRIDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలకు చెందిన బిటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణా తరగతులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదుకు చెందిన ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్ సిఇవో మహమ్మద్ షకీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తుల్లో అంతర్లీనంగా దాగిఉన్న వారి సామర్ధ్యాలను బహిర్గతం చేయడంలో సహాయపడడం ద్వారా అసాధారణమైన ప్రతిభాశీలురుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. విద్యార్థులు ప్రతీ ఒక్కరూ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో పయనిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని తెలిపారు. తాను ఐదు సంవత్సరాల వయస్సులో కంటిచూపు కోల్పోయానని, అయినా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పయనిస్తున్నానని, పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని మొట్టమొదటిసారిగా బ్రెయిలీ లిపిలో అనువదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించానని అన్నారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ప్రశంసలు కూడా అందుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ విషయాలను జ్ఞాపకం ఉంచుకునే పద్దతులపై చిట్కాలు వివరించారు. ఈ కార్యక్రమంలో గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, హెచ్.బి.ఎస్ డీన్ డాక్టర్ వి. కుసుమకుమారి, కోఆర్డినేటర్ ఐ. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







