* వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకిరామ్
UPDATED 10th MARCH 2021 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): మెట్ట రైతులు దుంప సాగులో తెగుళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి. జానకిరామ్ తెలిపారు. మండల పరిధిలోని కొండపల్లి, ఆర్.బీ.పట్నం, ఆనూరు, వాలు తిమ్మాపురం గ్రామాల్లో ఆయన తన బృందంతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై దుంప సాగులో చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు, తదితర విషయాలపై వారికి తగు సూచనలు, సలహాలను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుంప సాగులో ఎల్లో మొజాయిక్ తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శ్రీరక్షా, శ్రీశక్తి, పీడీపీ సీఎంఆర్-1 విత్తన రకాలను ఎంచుకోవాలన్నారు. ఇటీవల తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొత్తగా పిండినల్లి ఆశిస్తున్నందున దానిపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విత్తన కర్ర నిల్వ, దుంప పిండితో ఆహార ఉత్పత్తులైన నూడిల్స్, చిప్స్ తయారీ, అప్పడాలు, పాస్తా మొదలైనవి దుంప సాగుతో లాభాలు ఉన్నాయని వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్.ఎస్.కె. రెడ్డి, శాస్త్రవేత్తలు భగవాన్, రామానందం, చలపతి, మమత, జానకి, ఉద్యానశాఖ డీడీ ఎస్. రామ్మోహన్, ఎన్. సుజాత, తదితరులు పాల్గొన్నారు.







