UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 8:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలోని సరస్వతీదేవి నిలయంలో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు శుక్రవారం ఉదయం ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు పందిరి రాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామశర్మ మాట్లాడుతూ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే శరన్నవరాత్రి ఉత్సవాలను ఈనెల 29 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 29 ఉదయం 8-58 నిమిషాలకు కలశస్థాపన జరుగుతుందని, ప్రతీరోజు ఉదయం పంచామృత అభిషేకాలు, సాయంత్రం లలిత సహస్రనామాలతో సహస్ర కుంకుమార్చన, సహస్ర పుష్పార్చన జరుగుతాయని అన్నారు. 5వ తేదీ మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవికి ప్రీతిగా సహస్ర కళాశాలతో విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 6న దుర్గాష్టమి సందర్భంగా దుర్గా హోమం, 8న విజయదశమి సందర్బంగా ఆయుధ పూజ, శమీ పూజ, 9న అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనం జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇంఛార్జ్ మేడపాటి భాస్కర చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







