UPDATED 3rd MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: ఆసుపత్రి అభివృద్ధికి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అధ్యక్షతన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి మంజూరు అయిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. చంద్రరావుతో చర్చించారు. ఆసుపత్రికి కేటాయించిన అభివృద్ధి నిధులకు సంబంధించి నగదు నిల్వ రూ. ఐదు లక్షలుగా గుర్తించడం జరిగింది. ఈ సొమ్ముతో ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఖర్చుచేసి వివరాలను సమావేశంలో చర్చించి నివేదిక తయారు చేయడం జరిగింది. వీటిలో అంబులెన్స్ రిపేర్, ఫర్నీచర్, ఎసి, పెయింటింగ్, ఎమర్జన్సీ లైట్, వాషింగ్ రూమ్స్, తదితర అంశాలను నివేదికలో పొందుపర్చడం జరిగింది. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతం శానిటేషన్, డస్ట్ బిన్స్ ఏర్పాటు, డాక్టర్ల కొరత, జననీసురక్ష, కుటుంబ నియంత్రణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం, ఒఆర్ఎస్ పేకట్లు అందుబాటులో ఉంచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, డాక్టర్ కె. లక్ష్మి , ఆసుపత్రి పరిపాలనా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







