UPDATED 23rd JULY 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ బిబిఎ విద్యార్థులు పిఠాపురంలో గల సాధ్యా ఫౌండేషన్ పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందచేసినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు టి. రోహిత్, ఎస్. జస్వంత్, ఎ. జోసెఫ్, పి.రిచర్డ్ సన్, హెచ్. సాయిసత్య, డి. ప్రియ తదితర విద్యార్థుల బృందం చదువుతో పాటు వివిధ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రతీ విద్యార్థి సేవా కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు సహాయం సమాజానికి అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని, తద్వారా మానవతా విలువలు పెంపొందడమే కాక సమాజ అభివృద్ధికి దోహదపడినవారు అవుతారని అన్నారు. విద్యార్థుల బృందం రూ. 5280 విరాళాలు సేకరించి సంస్థ నిర్వాహకులకు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజం పట్ల తమకు గల బాధ్యతను గుర్తించి తోటి వారికి ఆదర్శంగా నిలవడం హర్షణీయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.







