రాహుల్ నిర్ణయంపై ప్రదీప్ హర్షం

UPDATED 15th SEPTEMBER 2017 FRIDAY 6:00 PM

ఏలూరు : రాబోయే 2019 ఎన్నికల్లో భావిభారత ప్రధానిగా నిలబడటానికి సిద్దమే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ మూడున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పులు రాలేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో బిజెపికి వచ్చిన సానుకూల స్పందన చూసి దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారని, బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్న రాష్ట్రాలలో సైతం ఎన్నికలకు రంగం సిద్దం చేసుకున్నారన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో అన్ని రాష్ట్రాలలోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కేంద్రప్రభుత్వం చేసిందని, ప్రజల్లో నరేంద్రమోడీకి విపరీతమై ఫాలోయింగ్ ఉంటుంది అని ఊహాలోకాల్లో విహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీకి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల బర్మాలో మైనార్టీలపై దాడులు జరిగినప్పుడు ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనలోనే ఉన్నారని, ఆదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున  వ్యతిరేకత సైతం వచ్చిందని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా శ్రేయస్సు కోసం సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టలేదని, యుపిఏ ప్రకటించిన పథకాలనే మోడీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారని, విదేశాల్లో నల్లధనాన్ని తీసుకువస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని, వీటిని నమ్మిన దేశప్రజలు మోడీ మాయలో పడిపోయారన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు మీద వ్యతిరేకత వ్యక్తమవుతోందని , ఈవ్యతిరేకత తన ప్రభుత్వం మీద పడుతుందనే భయంతో ముందస్తు ఎన్నికల ఆలోచన విరమించుకుని 2019 నాటికే ఎన్నికలకు వెళ్లాలనే మోడీ ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ తరహా పరిపాలన అందిస్తారన్న ప్రజల యొక్క ఆశలు నీరుకారిపోయాయని, మోడీ మతతత్వంతో తీసుకున్న నిర్ణయాలు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అమల్లోకి తెచ్చిన జిఎస్టితో లాభం కంటే నష్టాలు ఎక్కువని విమర్శించారు. చేనేతపై వేసిన జియస్టితో ఎన్నో చేనేత కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయాయని అన్నారు. అన్ని వస్తువుల మీద జియస్టి భారం వేసిన కేంద్రం పెట్రోల్ మీద జిఎస్టి పన్ను వేయకుండా దేశప్రజలను మోసం చేసిందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు జియస్టి ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. నిత్యావసర ధరల నియంత్రణలో మోదీ వైఫల్యం చెందారన్నారు. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశప్రజలకు కానీ, దేశానికి కానీ ఎటువంటి ఉపయోగం కలగలేదని ఈ నిర్ణయంతో దేశప్రజలు ఎంతో అసౌకర్యానికి గురయ్యారని, అయినా దేశభవిష్యత్తు కోసం ఆ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. కానీ ఈ నిర్ణయం ఒక విఫల ప్రయోగంగా మారిందని దుయ్యబట్టారు. అసమర్ధ నిర్ణయాల వల్ల మోడీ ప్రతిష్ట దిగజజారుతుందని మోదీ గుర్తించాలన్నారు. యూనివర్శిటీ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో (కాంగ్రెస్ అనుబంధ సంఘం) ఎన్ఎస్ఇవై గెలిచిందని పంజాబ్ లోనూ గెలవడం జరిగిందన్నారు. దేశభవిష్యత్తును నిర్ణయించే యువకులు బిజెపి పట్ల వ్యతిరేకత ధోరణితో ఉన్నారని ఈ సంఘటనతో రుజువయిందన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో ఎప్పుడైతే ఎన్ఎస్ఇవై గెలిచిందో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల మీద వ్యతిరేకత అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఎన్ఎస్ఇవై గెలవడం వల్ల కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరిసిందన్నారు. కాలిఫోర్నియోలో రాహుల్ ప్రసంగం కూడా దేశప్రజలను ఆకట్టుకునేలా ఉందని, దేశాన్ని ఎలా ముందుకు నడపాలనే దానిపై రాహుల్ ప్రసంగం కొనసాగిందన్నారు. నిస్తేజంలో ఉన్న క్యాడర్ కు రాహుల్ ప్రసంగం ఒక టానిక్ లా ఉపయోగపడుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రదీప్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us