హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు

UPDATED 11th OCTOBER 2017 WEDNESDAY 5:00 PM

కాకినాడ: హిందువులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ కులాల మధ్య సమాజంలో చిచ్చుపెట్టాలని చూస్తే సహించేదిలేదని వివిధ జిల్లాలకు చెందిన స్వామిజీలు పేర్కొన్నారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక, హిందూ ధర్మరక్షా సమితి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో బుధవారం ‘ఛలో కాకినాడ’ పేరిట నిరసన కార్యక్రమాలను స్థానిక బాలాజీ చెరువు సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి చెందిన కమలానంద భారతీ స్వామి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇన్‌చార్జి శ్రీనివాసానంద భారతి స్వామి, విజయనగరం జిల్లాకు చెందిన వాసుదేవానంద భారతి స్వామి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆనంద సరస్వతి స్వామి, కర్నూలు జిల్లాకు చెందిన రంగనాథస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన భవానీ శంకరానంద స్వామి, నెల్లూరు జిల్లాకు చెందిన సిద్ధేశ్వరానందస్వామి, శ్రీశైవక్షేత్రానికి చెందిన శివశంకరానందస్వామి, ధర్మోరక్షతి రక్షితఃకు చెందిన షణ్ముకానందస్వామిలు ప్రసంగించారు. హిందువులపై దాడులు పెరిగిపోయాయని, వీటిని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో హిందువులకు, హిందూ కులాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. హిందువులలో ఉన్న కులాలను కించపరుస్తూ, సామాజిక విద్వేషాన్ని రేకెత్తిస్తూ కంచె ఐలయ్య శాంతికి భంగం కలిగిస్తున్నారని, అతడిని తక్షణం  అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల నివాసాల మధ్య అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చిలు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హిందువులంతా ఐక్యమై జరుగుతున్న కుట్రలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న ఐలయ్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆయన పట్టాలను రద్దుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హిందూ ధర్మరక్షాసమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని బలరామయ్య, అధ్యక్షుడు చేదులూరి గవరయ్య, శివశక్తి అధ్యక్షుడు కరుణాకర్‌లు మాట్లాడుతూ హిందువుల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. వేలాదిగా తరలి వచ్చిన హిందువులు బాలాజీచెరువు సెంటర్ నుంచి జీజీహెచ్‌, జడ్పీ సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇన్‌ఛార్జి పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, ఎన్వీ సాయిబాబా, బండారు భాస్కర్‌, ఆర్యవైశ్య సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, బాదం బాలకృష్ణ, గ్రంధి బాబ్జి, దంగేటి సతీష్‌, పైండా శ్రీను, బచ్చు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us