UPDATED 21st FEBRUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: తపాలా శాఖ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ డాక్టర్ యం. వెంకటేశ్వర్లు అన్నారు. కాకినాడ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ సి.హెచ్. సూర్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఈఎన్ఎస్ కల్యాణ మండపంలో తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా, క్రొత్త సీవింగ్స్ బ్యాంకు ఖాతాల మెగా మేళా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ డాక్టర్ యం. వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ (విశాఖపట్టణం) అరవింద పాండా ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ తపాలా జీవిత భీమా పధకంలో అతి తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ సదుపాయం ఉందని, ఈ భీమా ఇతర బీమా సంస్థల కన్నా మెరుగైనదని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిర్దేశించబడిన ఈ భీమా రక్షణ కనీసం రూ.10 వేలు నుంచి గరిష్టంగా రూ. పది లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తపాలా జీవిత భీమా ప్రాముఖ్యతను తెలుపుతూ పియల్ఐ తన పరిధిని మరింత విస్తృతం చేసి ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఈ పాలసీని ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్ లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, గేట్ పరీక్ష వ్రాసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఓపెన్ స్కూల్స్ ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఫార్మా, టెలికాం, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు కూడా తీసుకొనే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. కాకినాడ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ తపాలా డివిజన్ ప్రగతి, తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా విశిష్టతను వివరించారు. ఈ మెగా మేళా సందర్భంగా కాకినాడ పోస్టల్ డివిజన్ లో గల గ్రామీణ తపాలా ఆఫీసుల సిబ్బంది తమ తమ గ్రామాలలో గడప గడపకు వెళ్లి గ్రామీణ తపాలా జీవిత భీమా విశిష్టతలను వివరించాలని, గతంలో ఎన్నడూ లేని విధముగా సుమారు రూ.20 లక్షల గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం సేకరించారని, అలాగే సుమారు రూ.5 లక్షల తపాలా జీవిత భీమా ప్రీమియం ఈ సందర్భంగా సంపాదించి కాకినాడ పోస్టల్ డివిజన్ ప్రత్యేకతను చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోస్టల్ సబ్-డివిజనల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. శ్రీరాములు, పెద్దాపురం పోస్టల్ సబ్-డివిజనల్ ఇనస్పెక్టర్ ఎ. వీరభద్రరావు, కాకినాడ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హెడ్ క్వార్టర్స్) కె. శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (రెగ్యులర్) డి.వి.యల్. విశ్వేశ్వరరావు, కాకినాడ దక్షిణ పోస్టల్ సబ్ డివిజన్ ఇనస్పెక్టర్ షేక్ మొహమ్మద్, సామర్లకోట హెడ్ పోస్ట్ మాస్టర్ డి.కె. శేషాచారి, అధిక సంఖ్యలో పోస్టల్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.







