UPDATED 18th SEPTEMBER 2019 WEDNEDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వెయ్యి రోజుల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐసిడిఎస్ సూపర్ వైజర్ నిర్మలాకుమారి పేర్కొన్నారు. పోషకాహార మాసోత్సవాలు సందర్భంగా స్థానిక బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలోని కుమ్మరిపేట అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త శ్యామలాదేవి అధ్యక్షత గర్భిణీలు, బాలింతలకు బుధవారం అవగాహనా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిర్మలాకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు సంరక్షణ నిమిత్తం వెయ్యి రోజుల సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, గర్భిణీగా ఉన్నపుడు రెండు సంవత్సరాల కాలం వరకు అతి ముఖ్యమైన రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిందని, ఈ సమయంలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రస్తుతం ఉన్న వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసం, పాల పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్న మధ్యాహ్న భోజనం, బాల సంజీవని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఐసిడిఎస్ తరఫున కృషి జరుగుతుందని తెలిపారు. పోషకాహార మాసోత్సవాలు ఈ నెలాఖరు వరకు జరుగుతాయని, ప్రతీ అంగన్వాడీ కార్యకర్త విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు పి. బాలమ్మ, అధిక సంఖ్యలో బాలింతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







