నూతన కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ విశాల్ గున్ని
UPDATED 18th AUGUST 2017 FRIDAY 10:00 PM
కాకినాడ : దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలని, అప్పుడే ప్రజలు సంతోషంగా ఉండడంతో పాటు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని పేర్కొన్నారు. కొత్తగా ఎంపికైన 268 మంది సివిల్ కానిస్టేబుళ్లు శిక్షణా కార్యక్రమం స్థానిక 3వ ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కమాండెంట్ జె.కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా, ఎస్పీ విశాల్‌గున్ని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాదారు. ఎంతో శ్రమతో పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి, 9 నెలల శిక్షణా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి నీతి, నిజాయతీ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ దేశానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవర్తించాలని సూచించారు. ఈరోజు దేశంలో ఉండే ప్రతి పౌరుడు చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగం సాధించాలని కలలు కంటారని, అయితే కొందరికి మాత్రమే అవకాశం ఉంటుందని, ఈ అవకాశం దొరికిన మీరంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసులు చేసినంత ఎక్కువ పని ఇతర శాఖల్లో ఉండదని, రకరకాల డ్యూటీలు చేస్తూ శాంతిభద్రతలను కాపాడుతుంటారన్నారు. శిక్షణలో తగిన విశ్రాంతితో పాటు ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే ఏపనైనా సమర్థంగా చేయగలమన్నారు. ప్రతి ఒక్కరు తెలుగుతో పాటు ఇతర భాషా పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. కమాండెంట్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ పోలీసు అకాడమీలో 16 సంవత్సరాలు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించానని, ఈ సంవత్సరం 5,600 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని, వీరిలో 268 మంది విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి శిక్షణకు ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్ పి.లోక్‌నాథ్‌బాబు, ట్రైనింగ్ ఆర్‌ఐలు శేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన 268 మందిలో 80 శాతం ఇంజినీరింగ్, పీజీ, ఎంబీఏ తదితర ఉన్నత విద్యార్హతలున్నవారే. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు 75 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.







