* డిఎస్పీ చిలకా వెంకట రామారావు
* సిబ్బందిని ప్రశంసించిన డిఎస్పీ
UPDATED 17th APRIL 2019 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ప్రశాంతంగా నిర్వహించామని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందితో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా డిఎస్పీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కృషి చేశామని తెలిపారు. పోలింగ్ ముగిసినా కోడ్ ఇంకా అమల్లోనే ఉందని గుర్తు చేశారు. పోలింగ్ తర్వాత గ్రామాల్లో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడినా ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందుగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ యువకుమార్, ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్, తదితరులు పాల్గొన్నారు.







