UPDATED 24th JUNE 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం: జూలై నెల ఒకటవ తేదీ నుంచి ఆగష్టు నెల ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మిని ఆదేశించారు. బారికేడ్లు ఏర్పాటు, షామియానాలు, మరుగుదొడ్లు, త్రాగునీరు, స్వచ్చంధ సేవా సంస్థల సేవలు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, రోడ్లు, పారిశుధ్యం, మెడికల్ క్యాంపు, పండ్ల దుకాణాల ఏర్పాటు, సమాచార కేంద్రం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, సిఐ యువకుమార్, ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







