UPDATED 16th SEPTEMBER 2019 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రకృతి పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులు కావాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో వినియోగిస్తున్న కొన్ని కారకాలతో ఓజోన్ పొర క్షీణిస్తోందని, ఇలాగే కొనసాగితే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఈ పొరను కాపాడుకుంటే ప్రమాదకర వాయువుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, విరివిగా చెట్లు నాటడం ద్వారా మన పుడమిని కాపాడే ఓజోన్ పొరను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ఇటువంటి సదస్సుల వల్ల విద్యార్థులు, ప్రజల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపుదల వంటి అంశాలపై వివిధ కార్యక్రమాల ద్వారా పాఠశాల గ్రీన్ కోర్ కమిటీ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణంపై పోటీలు నిర్వహించి మున్సిపల్ కమీషనర్ చేతుల మీదుగా విలువైన పుస్తకాలను బహుకరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రారంభించిన ఓజోన్ దినోత్సవ ర్యాలీని కమీషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, కె. శ్రీనివాస్, కె. అరుణ, సిహెచ్.వి. భద్రావతి, కెవివి సత్యనారాయణ, లక్ష్మీదుర్గ, కె. శేఖరం, తదితరులు పాల్గొన్నారు.







