Ts News: హైదరాబాద్‌లో ప్రారంభమైన నుమాయిష్‌

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : భాగ్యనగర ప్రజలను అలరించేందుకు నుమాయిష్‌ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇవాళ ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది నుమాయిష్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా స్టాళ్ల సంఖ్యను తగ్గించారు. ఏటా 2వేలకుపైగా ఏర్పాటు చేసే స్టాళ్లను ఈ సారి 1,600కు కుదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి Ts News: హైదరాబాద్‌లో ప్రారంభమైన నుమాయిష్‌ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుమాయిష్‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. ప్రదర్శనకు అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారులు, సందర్శకులు రావడం వల్ల కేవలం వినోదం, వాణిజ్య పరంగానే కాకుండా దేశ సమైక్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రదర్శనలో కొవిడ్‌ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె అభినందించారు. ఎగ్జిబిషన్‌లో కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మాస్క్‌ పెట్టుకోని వాళ్లను నుమాయిష్‌లోకి అనుమతించొద్దని సంబంధిత అధికారులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధులకు గవర్నర్‌ ఆదేశించారు. మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ సారి నుమాయిష్‌కి జమ్ము కశ్మీర్‌ నుంచి కూడా వ్యాపారులు వచ్చారని వెల్లడించారు. ప్రదర్శనలో రుచికరమైన ఆహార పదార్థాలు ఉంటాయన్నారు. ప్రజలు మాస్క్‌ లేకుండా నుమాయిష్‌కి రావొద్దని మంత్రి సూచించారు. నుమాయిష్‌లో టీకా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని.. ఇప్పటివరకు రెండు డోసులు వేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us