UPDATED 8th NOVEMBER 2020 SUNDAY 7:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న వైద్య సేవల్లో ఆరోగ్యమిత్రల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యమిత్ర, టీం లీడర్ ఉద్యోగ నియామకాల కోసం శనివారం జేఎన్‌టీయూలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించగా, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మౌఖిక పరీక్షల ప్రక్రియను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఈ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వీవీఐపీలకు ఎలాంటి వైద్యం అందుతుందో అలాంటి వైద్యాన్ని పేదలకు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, హెల్ప్ డెస్క్ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే వారిని చిరునవ్వుతో పలకరించి, మంచిగా మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఆరోగ్య మిత్రలపై ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులు గురించి వారి కుటుంబ సభ్యులకు సరైన సమాచారం ఇస్తే వారెంతో ఆనందిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి గ్రామస్థాయిలో సరైన అవగాహన లేక చాలా మంది ప్రజలు మోసపోతున్నారని, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక ఉత్తర్వులు అందచేసిన అనంతరం తర్వాత శిక్షణ ఉంటుందని తెలిపారు. నియామక ప్రక్రియలో అకడమిక్ మెరిట్‌కు 65 శాతం, కంప్యూటర్ నైపుణ్యాలకు 15 శాతం, మౌఖిక పరీక్షకు 20 శాతం వెయిటేజీ ఇచ్చినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి. రాధాకృష్ణ, జిల్లా మేనేజర్ డి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







