వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో అధిక దిగుబడులు

UPDATED 30th DECEMBER 2018 SUNDAY 9:00 PM

పెద్దాపురం: వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రయోగశాల, కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మనదేశంలో 70 శాతం మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను వేసుకుని సాగు చేయాలని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనల మేరకు రైతులు చిరు ధాన్యాలను సాగు చేయాలని, వరిలో నూతన వంగడాలు వేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. అలాగే మొక్కజొన్న పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శాసన నుండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయరంగంలో ఎన్నడూ లేని విధంగా రైతులు దిగుబడులు సాధిస్తున్నారని, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని పరిశోధనా కేంద్రాల ద్వారా నూతన వరి వంగడాలు రూపుదిద్దుకుని వాటి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్‌ వల్లభనేని దామోదరనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గల అన్ని జిల్లాల్లో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్దాపురం పట్టణంలో పరిశోధన కేంద్రంతో పాటు కార్యాలయ భవనం ఎనిమిది నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశోధనా కేంద్రానికి ముగ్గురు శాస్త్రవేత్తలను నియమించడం జరిగిందని, అవసరం మేరకు మరో మూడు పోస్టులు కూడ మంజూరు చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో రూ.440 కోట్లు నిధులతో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా నూతన వంగడాలను తయారుచేసి రైతులకు సత్వరమే అందేలా చూడటం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధంగా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి మండలం పరిశోధనా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ పి. మునిరత్నం, ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎస్టేట్ ఆఫీసర్ నరసింహారావు, శాస్త్రవేత్తలు ఎన్.వి. నాయుడు, సీతారామశర్మ, ఇంజేటి సుధాకర్, ఎడిఎ రత్నప్రశాంతి, పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుజాత, ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us