ఆసుపత్రి నిధులు సక్రమంగా వినియోగించాలి

UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రభుత్వ ఆసుపత్రికి విడుదలయ్యే నిధులను సక్రమంగా వినియోగించాలని కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధికి విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని, వినియోగించని నిధులను వేరే ఆసుపత్రికి వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ ఆసుపత్రికి నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తున్నామని దీనిలో భాగంగా జనరేటర్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని అన్నారు. సామర్లకోట ముఖ్య కూడలిగా కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, పోస్టుమార్టం నిమిత్తం వైద్యులు పెద్దాపురం పట్టణం వెళ్లవలసి వస్తుందని అన్నారు. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పి. చంద్రరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో కేవలం ఒక వార్డు మాత్రమే ఉండడం వల్ల దానిలోని రోగులందరినీ ఆ వార్డులోనే ఉంచవలసి వస్తుందని తెలిపారు. కమిటీ  సభ్యుడు పోలిపల్లి బాబీవర్ధన్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో వచ్చే రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు రోగుల సంఖ్య బాగా పెరిగిందని, గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా రావడంతో ఆసుపత్రిలో అదనపు వైద్యులను వెంటనే నియమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ఆర్డీవో ఆసుపత్రిలో గల గర్భిణీ స్త్రీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. లక్ష్మి ఎంపీడీవో సి.హెచ్. జగ్గారావు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us