* జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం
* జవహర్ నవోదయాలో ముగిసిన క్లస్టర్ స్థాయి బాల్ గేమ్స్ పోటీలు
UPDATED 11th JULY 2019 THURSDAY 9:00 PM
పెద్దాపురం: శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి బాల్ గేమ్స్ పోటీలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో జిల్లా విద్యాశాఖాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను విద్యార్ధి దశ నుంచి విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చానని, ప్రతీ ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఉత్తమ విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్న నవోదయా విద్యాలయాలు ప్రగతిపథంలో నడుస్తున్నాయని, పేద కుటుంబాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ విద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మునిరామయ్య సేవలను ఆయన అభినందించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, యానాం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లా జట్ల విజేతలకు డీఈవో చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సభలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డి. పరశురామయ్య, వ్యాయమ అధ్యాపకులు ఆర్. సత్యనారాయణ, సీనియర్ ఉపాధ్యాయులు బి.కె. ప్రసాద్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







