UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 8:00 PM
సామర్లకోట: వినాయక చవితిని పురస్కరించుకుని రంగురంగుల రసాయనాలతో చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించకుండా సంప్రదాయ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఎపి నేషనల్ గ్రీన్ కోర్, అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రవాస భారతీయుడు కె. సత్యనారాయణ సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా సుమారు 500 మట్టి గణపతి ప్రతిమలను మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ మన పూర్వీకులు ప్రతీ పండక్కీ ఒక ప్రత్యేకతను చూపించారని, ఆ పండగ తెచ్చే సంబరాలు మనతో పాటు మన పర్యావరణానికి ఏ మేరకు మేలు చేస్తాయో వివరించారన్నారు. నేటితరం పండగల నిర్వహణలో అత్యుత్సాహానికి పోయి పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారన్నారు. చవితి రోజున వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తితో కొలిచే ఈ పండగ ప్రకృతి ఆరాధనలో భాగంగా కొనసాగుతోందని, సహజంగా లభించే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయాలని పురాణాలు పేర్కొంటున్నాయన్నారు. నవరాత్రుల అనంతరం ఈ విగ్రహాలను ప్రవాహ నీటిలో కలపాలని సూచిస్తున్నాయని, నీటిలో సులువుగా కరిగిపోయే మట్టి వినాయకులు జలాన్ని కాని వాతావరణాన్ని కాని ఏవిధంగానూ కలుషితం చేయవన్నారు. విఘ్నేశ్వరుడి పూజకు వినియోగించే పూలు, పత్రి, కాయలు, పండ్లు, విస్తర్లు, నైవేద్యాలు ప్రకృతి ప్రసాదించినవే అని, భగవంతుని పూజ అంటే ప్రకృతి పూజని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి వై.వి. శివరామకృష్ణయ్య, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







