UPDATED 11th FEBRUARY 2019 MONDAY 10:00 PM
పెద్దాపురం: విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి చెబుదామని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా పెద్దాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. దీనిలో భాగంగా స్థానిక మున్సిపల్ జంక్షన్ నుంచి ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు దేశవ్యాప్తంగా భారీగా మద్దతు లభిస్తోందని అన్నారు. అనంతరం ఆర్డీవో వసంతరాయుడుకు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, మహారాణీ సత్రం చైర్మన్ తూతిక రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆచంట రాజన్న, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు చాగంటి గోపాలకృష్ణ, కాకినాడ రామారావు, డాక్టర్ తాళాబత్తుల సాయి, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.







