యువత లక్ష్యాలను నిర్దేశించుకుని సాగాలి

UPDATED 15th NOVEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని కస్టమ్స్ జాయింట్ కమీషనర్ సాధు నరసింహారెడ్డి అన్నారు. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు మాధ్యమం విద్యార్థులు సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎలా సన్నద్దమవ్వాలి అనే అంశంపై నిర్వహించిన సభలో కస్టమ్స్ జాయింట్ కమీషనర్ సాధు నరసింహారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువత వారి భవిష్యత్తుకు విద్యార్థి దశ నుంచే బాటలు వేసుకోవాలని, పేదరికం, తెలుగు మీడియం, గ్రామీణ నేపథ్యం అడ్డంకులు కావని అన్నారు. పట్టుదల, క్రమశిక్షణ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని విద్యార్థులకు సూచించారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే అంకితభావం పెట్టుబడిగా పెట్టాలన్నారు. ఇంగ్లీషు మీడియం విద్యార్థులే సివిల్స్ లో విజయం సాధిస్తారనే అపోహను విడనాడి తెలుగు మీడియంలో చదివిన రేవు ముత్యాల రాజులాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పోటీ పరీక్షలలో గ్రంథాలయ పాత్ర ప్రముఖంగా ఉంటుందని, గ్రంథాలయాల మీద ఆధారపడి అనేకమంది విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఐ.శారద మాట్లాడుతూ నేటి విద్యార్థులే భావితరాల ఉన్నతాధికారులని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. కళాశాల లైబ్రేరియన్ శాంతిశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థులు విద్యకు సంబంధించిన పుస్తకాలే కాకుండా మహాత్ముల జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జి పుస్తకాలు, వార్త పత్రికలు, తదితర పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. అనంతరం పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను కమీషనర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో టి.వి. మధు, పి.డి. రత్నశామ్యూల్, విద్యార్థినీ విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us