UPDATED 30th MAY 2020 SATURDAY 6:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రైతన్న ముంగిట్లో అన్ని సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. మండలంలోని మర్లావ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రతీ గడపకు ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనతను సొంతం చేసుకున్నారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచికగా నిర్దేశించుకున్న జగన్ అన్ని రంగాల్లోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చడానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఈ కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు నిరంతర శిక్షణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ స్టాల్స్,కియోసిక్ మెషీన్ ను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ ఎం. రత్నప్రశాంతి, ఏవో కొల్లి ద్వారకాదేవి, ఎంపిడివో అబ్బిరెడ్డి రమణారెడ్డి, తహసీల్దార్ బూసి శ్రీదేవి, పశు సంవర్ధక శాఖ ఎడి డాక్టర్ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ నవీన్, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల సిబ్బంది, గ్రామ సచివాలయాల సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.







