UPDATED 16th JULY 2019 TUESDAY 6:00 PM
సామర్లకోట: షిరిడీ సాయినాథునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు గురు పౌర్ణమి.. అందుకే భక్తులందరికీ ఇదో పర్వదినం. ఈ సందర్భంగా మంగళవారం సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. పట్టణ పరిధిలోని స్థానిక రైల్వేస్టేషన్ సెంటర్లో వేంచేసిఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రా సాయిగీతా సమాజం ఆధ్వర్యంలో మంగళవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయి దర్శనం చేసుకున్నారు. కాగడ హారతి, పాదపూజలు అనంతరం సాయి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా సాయిగీతా సమాజం అధ్యక్షులు డి. అప్పారావు, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి అప్పారావు, కార్యదర్శి గండ్రోతుల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ సేపేని సూరిబాబు, ట్రెజరర్ దుక్కా రాజబాబు, చీఫ్ అడ్వైజర్ దవులూరి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, బత్తుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..







