UPDATED 1st SEPTEMBER 2018 SATURDAY 6:00 PM
సామర్లకోట: జిల్లాలో డెంగ్యూ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ డెంగీ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, జిల్లా కలెక్టరు దీనిపై అధికారులకు చర్యలు నిమిత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో డెంగ్యూ వ్యాధికి గురై మరణించిన నేపథ్యంలో మండల పరిధిలో గల అన్ని గ్రామాల్లోను అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి పారిశుద్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని చెత్త, చెదారం పెరిగిపోవడం, మురికినీరు ఉండటం వంటి కారణాలు వల్ల దోమల సమస్య ఏర్పడి డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని అన్నారు. ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించి చెత్తా, చెదారం రోడ్డుపై వేయకుండా చూడాలని తెలిపారు. ఈ రోజు నుంచి పౌష్టికాహార వారోత్సవాలు ఏడవ తేదీ వరకు రాష్ట్రమంతటా మహిళా, శిశుసంక్షేమ శాఖ నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), జెడ్పీటీసీ గుమ్మళ్ల విజయలక్ష్మి, తహసీల్దార్ ఎల్.శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.







