అట్టహాసంగా ప్రారంభమైన కాకినాడ బీచ్‌ ఫెస్టివల్ వేడుకలు

UPDATED 19th DECEMBER 2017 TUESDAY 10:00 PM

కాకినాడ: విరుల సోయగాలు,.మత్స్యరాశుల ముచ్చటైన రూపులు, తప్పెటగుళ్ల జయధ్వనులు, దేవతామూర్తుల వేషధారణలు,.కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, అబ్బురపరిచే సాహస క్రీడలు ఇలా ఎక్కడ చూసినా సందడే సందడి. తన చెంత జరుగుతున్న సందడిని చూసి సాగరుడు ఉవ్వెత్తున ఎగిసి పడిన అలలతో జన సంద్రానికి స్వాగతం పలికాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో బీచ్‌ ఫెస్టివల్ వేడుకలు మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ కళలు, వంటలతో పాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత విభావరితో కాకినాడ బీచ్ ఉత్సాహం నిండింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రజలు బీచ్‌కి తండోపతండాలుగా  తరలివచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన వంతెన మీదుగా సభా ప్రాంగణానికి వచ్చే మార్గంలో దారి పొడువునా సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్తు దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు బీచ్‌ ఫెస్టివల్‌ను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్తు శాఖా మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ వేడుకలు సంప్రదాయం, సంస్కృతికి వారధిగా ఉంటాయని, భౌగోళికంగా భిన్న ప్రాంతాలు ఉన్నా సమాజంలో అందరం ఒక్కటే అన్న భావన కలిగించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గోదావరిలో పర్యాటక ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నారన్నారు. సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలు కొన్ని మతాలకు ప్రత్యేకం అయితే బీచ్‌ ఫెస్టివల్ అందరిదని అభివర్ణించారు. సాగర సంబరాల్లో జనం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్య ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముత్యాల్లాంటి అలంకరణ చేపలు వీక్షకులలో ఆనందాన్ని నింపాయి. ఈ ప్రదర్శనలో 90కి పైగా మత్స్య జాతులు సందడి చేశాయి. వాటిలో 70 జాతులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. సాగర సంబరాలలో వృద్ధులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించేందుకు పోలీస్‌ సేవాదళ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సేవాదళ్‌ సభ్యులుగా  ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం, చిన్నపిల్లలు తప్పిపోతే వారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడం సేవాదళ్‌ విధులన్నారు. ఇంటికొక మొక్క నాటండి... రానున్న 2020 నాటికి హరితాంధ్ర ప్రదేశ్‌గా మారుద్దాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశాన్నిస్తే మాట్లాడే బొమ్మ చక్కగా చెప్పింది. కె.సుధాకర్‌ వెంట్రిలాక్విజమ్‌ ద్వారా పచ్చదన సందేశాన్ని సీఎం మాటగా చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన యోగేష్‌ బృందం జుగల్‌బందీ, గొల్లల మామిడాడకు చెందిన దేవగుప్తం సూర్యసాయి బృందం శ్రీకృష్ణ రాయబారం పద్యాలు, తునికి చెందిన ఎస్‌కే బాబ్జి వేణుగానం సాగర తీరాన్ని మధురానగరంగా మార్చేసింది. కాకినాడకు చెందిన జోర్డాన్‌ మ్యూజిక్‌ పాఠశాలకు చెందిన విద్యార్ధులు గిటార్‌, ప్యాడ్‌, జాజ్‌లపై చక్కని సంగీతం, ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఇవ, ఆంటోలు బాహుబలిలోని ‘పడమర కొండల్లో వాలిన సూరీడా’ అంటూ ఆలపించిన గీతంతో కరతాళధ్వనులు మోగాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్‌ క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ వంటి క్రీడలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఉప్పొంగెలే గోదావరి... ఊగిందిలే చేలో వరి... అంటూ తన గొంతునుంచి జాలువారే గోదావరి వైభవాన్ని తెలుపుతూ ప్రధాన కార్యక్రమంగా వేదికపై ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి  సినీ సంగీత విభావరి సందర్శకులకు వీనులవిందు చేసింది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అంటూ...ఎస్పీ శైలజ ఆలపించిన యుగళగీతం మాధుర్యానికి మైమరచిన జనం... సిరివెన్నెల చిత్రంలోని విరించినై వికసించితిని అంటూ బాలు, శైలజలు ఆలపించిన గీతానికి పులకించారు. అదరమదోలా..అదిరెనుకదేలా అంటూ హరిణితో కలిసి ఆలపించిన బాలు గళానికి సందర్శకులు సమ్మోహితులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్‌ గంగా.నిజంగా.అంటూ గంగోత్రి చిత్రంలోని గీతాన్ని ఆలపించారు. జైలవకుశ చిత్రంలోని రావణ శత్రు శేషణా.. అంటూ సాయిచరణ్‌, పిల్లా అలా నవ్వేసి పారిపోమాకే అంటూ ఎస్పీ అభిషేక్‌ ఆలపించిన గీతం యువతను ఉర్రూతలూగించింది. ఎస్పీ బాలు, ప్రియ కలిసి అన్నమయ్య చిత్రం నుండి దాసరథి కరుణాపయోనిధి అంటూ  భక్తిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మైనేప్యారికియా చిత్రంలోని గీతాన్ని కోరగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పెహలాపెహలా ప్యారెహై అంటూ హిందీ గీతాన్ని అలపించి అందరినీ ఉత్సాహ పరిచారు. అలాగే ఉత్సవాల ప్రధాన వేదిక వద్ద  కాకినాడకు చెందిన మహాలక్ష్మి నృత్య పాఠశాలకు చెందిన విద్యార్థులు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ చేసిన నృత్యం తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సాగాయి. అమరావతి ప్రాధాన్యం తెలుపుతూ సాగిన గీతాలాపన ఆకట్టుకుంది. సాగర సంబరాల్లో పూల గుబాళింపు సందర్శకులను ఆకట్టుకుంటోంది. సాధారణ పుష్పాలను తలదన్నే యాంతూరియమ్‌, ఏషియాటిక్‌ లిల్లీ, కార్నేషన్‌, ట్యూబ్‌రోజ్‌, హెల్‌కోనియా, డచ్‌రోడ్‌, స్టార్‌డైజీ, ఆర్క్‌డ్‌తో పాటు పలు రకాల దేశీయ జాతులను ప్రదర్శించారు. 160 రకాల పూల జాతులు వీనులవిందు చేస్తున్న ప్రదర్శనలో మూడో వంతు కడియం నుంచి తెచ్చినవే. మిగిలిన పుష్ప జాతులన్నీ బెంగళూరు, కోల్‌కతా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఎండుపూలు ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూరగాయలతో చేసిన వివిధ ఆకారాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పుష్పాల తాజాదనాన్ని 11 యంత్రాలు(ఏసి) సాయంతో కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కడియం ప్రసస్తిని విస్తరించేలా పుష్ప ప్రదర్శనకు కడియం పూల నగరిగా నామకరణం చేశారు. బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరైన ప్రజల సహనానికి పోలీసులు పరీక్ష పెట్టారు. పార్కింగ్‌ స్థలాలు వేదికకు దూరంగా ఉండడం, బీచ్‌ సమీపంలోకి సొంత వాహనాలను అనుమతించక పోవడంతో అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. చివరకు పాసులు ఉన్న వాహనాలను కూడా అనుమతించక పోవడంతో కార్యక్రమం మొదలైన తరువాత పలువురు వెనుదిరిగి వెళ్లిపోయారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటక శాఖ హెలికాప్టర్‌ రైడింగ్‌ను ఏర్పాటు చేసింది. అ ప్రాంతానికి వాహనంలో వెళ్లేందుకు కూడా బీచ్‌ వద్ద పోలీసులు ఆంక్షలు పెట్టడంతో హెలికాప్టర్‌ ఎక్కేందుకు వెళ్లే వారు అష్టకష్టాలకు గురయ్యారు. ఉప్పాడ వైపు నుంచి వస్తున్న వాహనాలను నేవీ సరిహద్దు వద్దే నిలిపివేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా కనిపించింది. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us