UPDATED 19th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : విద్యలో ప్రజల భాగస్వామ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిటీ ఎన్నికలకు శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ స్టేట్ అబ్జర్వర్ కె. గౌరీశంకర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి అధ్యక్షతన మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు జరపాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని, తరగతికి ముగ్గురు వంతున సభ్యులను ఎన్నుకొన్న అనంతరం విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేయాలని తెలిపారు. ప్రతీ తరగతిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ సహకారం తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించేందుకు హెచ్ఎం చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంఈవో విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యా కమిటీల్లో కనీసం 50 శాతం హాజరు ఉండే విధంగా చూడాలని, వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు వీలైనంతవరకు ఏకగ్రీవంగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. విద్యా కమిటీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ ఎన్నికల కోసం తహసీల్దార్, ఎంపీడీవోలను అబ్సర్వర్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సూపరింటెండెంట్ సిహెచ్ సంపత్ కుమార్, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి ఇంటి వెంకట్రావు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







