UPDATED 29th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించే స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఒక మహిళ అస్వస్థతకు గురైంది. స్థానిక బ్రౌన్ పేటకు చెందిన కాపవరపు సుశీలకు జ్వరంగా ఉందని బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన మందులు వేసుకున్న తర్వాత వాంతులు, కళ్ళు తిరగడంతో దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు మందులను పరిశీలించారు. వైద్యులు రాసిన మందులు కాకుండా షుగర్ మాత్రలు ఇవ్వడం వల్ల అస్వస్థతకు గురైనట్లు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయమై ఆమె బంధువులు ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆందోళన తీవ్రతరం కావడంతో ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సెల్వ తమ ఆసుపత్రి సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగిందని, తమ సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైద్యులు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.







